Thursday, June 30, 2022

మీ చిత్రం నా పంచపది విజేతలు

పంచపది సాహితీ కవన వేదిక
*మీ పాట నా పంచపది*-89
తేది:30.06.2022
విజేతలు:
*1.కవి కిరీటి:* పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు
*2.కవి రత్న:* ఉప్పల(కోగంటి)శాంతిశ్రీ గారు
*3.కవి తేజ:* కందూర్ చంద్రప్రకాష్ గుప్తా గారు

నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్
పంచపది రూపకర్త;హైదరాబాద్
సహ నిర్వహణ:MV ధర్మారావు

Tuesday, June 28, 2022

ఇంద్ర గణాలు సుార్య గణాలు కాక ఇవి చంద్ర గణాలు..

*✍️మన తెలుగు👏*
★★★★★★★★★★★★★★★
*👉 చంద్ర గణాలు, శిలా శాసనాలు 🤚*
★★★★★★★★★★★★★★★
*చంద్ర గణాలు.*
*ఇదివరకు మనం సూర్య గణాలూ, ఇంద్ర గణాలూ తెలుసుకున్నాము. ఇప్పడు చంద్ర గణాల గురించి తెలుసుకుందాము. చంద్ర గణాలు మొత్తం ౧౪ (14)  రకాలు.*
*చంద్ర గణములు*
1. భల = UIII
2. భగరు = UIIU
3. తల = UUII
4. తగ = UUIU
5. మలఘ = UUUI
6. నలల = IIIII
7. నగగ = IIIUU
8. నవ = IIIIU
9. సహ = IIIUI
10. సవ = IIUIU
11. సగగ = IIUUU
12. నహ = IIIUI
13. రగురు = UIUU
14. నల = IIII
   *పై గురు లఘువులను బట్టి మీరు తేలికగా గుర్తించ వచ్చు. ఐతే ఈ చంద్ర గణాలు ఎలా ఉపయోగ పడతాయో తెలుసు కోవాలి గదా.. "అక్కరలు" అనే ఛందస్సు లో ఉపయోగ పడతాయి. అక్కరల గురించి కొంచెం తెలుసుకుందాము.*
*అక్కరలు జాతి పద్యములు. ఇవి ఐదు విధములు.*
► మహాక్కర , మధ్యాక్కర , మధురాక్కర , అంతరాక్కర , అల్పాక్కర
   *మహాక్కర లొ పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కర కు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలొ మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలొ చంద్ర గణము రావలెన్ననియము ఉన్నది. అక్కర లలొ సూర్య గణము లేని అక్కర అల్పాక్కర.* *అదేవిధముగా చంద్ర గణము పాదాంతములొలేని అక్కర మధ్యాక్కర.*
ఈ పద్యాల గురించి విపులంగా తెలుసుకుందాము.
.........
*మధ్యాక్కరలు - ఛందస్సు*
కన్నడం లో ఈ ఛందస్సు ను "అక్షరలు" అంటారు. అదే తెలుగు లో "అక్కరలు" గా మారింది. 
"పాదే పాదే ప్రతి గణమపి యతిర్లక్ష్యతే సర్వేషాం మక్షరాణాం" అని చెప్పడం ద్వారా వీటిని మనం జానపదాలనుండి ఉద్భవించాయని చెప్పవచ్చు. ఈ అక్కరలలో చంద్ర గణాలు అక్కరకు వస్తాయి. చంద్ర గణాలు అంటే ఏమిటో ఇదివరలో తెలిసికొన్నాము. ఐతే "మధ్యాక్కర"లో మాత్రం చంద్ర గణాలు రావు. ఇవి చాల ప్రాచీనమైన శాసనాల్లో కూడా లభిస్తున్నాయి. బెజవాడ యుద్ధమల్లుని శాససనం (క్రీ!శ! 898-934) మధ్యాక్కర, వెంకయ చోడుని దొంగలసాని శాసనం లో (క్రీ!శ! 991 సం.) మహాక్కరలు లభ్యమౌతున్నాయి. బహుశా.. కన్నడం.. ఆంధ్ర ఒకే గొడుగు కింద ఉన్నప్పటి నుండీ ఈ "అక్కరలు" వ్యాప్తి లో ఉండి వుండ వచ్చు అని చరిత్ర కారులు భావిస్తున్నారు. ప్రాచీన కవుల్లో... నన్నయ్య, ఎర్రన వాడగా... అధునికుల్లో విశ్వనాథ మధ్యాక్కరలు చాలా సుప్రసిద్ధం గా నిలిచాయి.
*చంద్ర గణాలు మళ్ళీ ఒక సారి మననం చేసికొందాము.*
*చంద్ర గణములు*
1. భల = UIII
2. భగరు = UIIU
3. తల = UUII
4. తగ = UUIU
5. మలఘ = UUUI
6. నలల = IIIII
7. నగగ = IIIUU
8. నవ = IIIIU
9. సహ = IIIUI
10. సవ = IIUIU
11. సగగ = IIUUU
12. నహ = IIIUI
13. రగురు = UIUU
14. నల = IIII
ఈ అక్కరలు ఐదు విధాలుగా ఉన్నాయి. 1. మహాక్కర 2.మధురాక్కర 3.అంతరాక్కర 4.అల్పాక్కర మరియూ 5. అత్యంత ప్రసిద్ధి గాంచిన మధ్యాకరలు.
1. మహాక్కరలో ... 1 సూర్యగణం, 5 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 7 గణాలు ఉంటాయి.యతి నాలుగు గణముల మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.
వారి  జాప్తుండు  పంచేంద్ర  గుణములు  వనజారి  యునుగూడి  వెలయుచుండ.
UI UUI UUI IIII IIUI IIUI IIIUI
పై విధంగా ఉంటుంది.
........
2. మధురాక్కరలో ... 1 సూర్యగణం, 3 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 5 గణాలు ఉంటాయి.యతి మూడు గణముల మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.
తనర  జనకుండు  నన్నప్ర  దాతయు  నుభయత్రాత
III IIUI UUI UII IIIUI
పై విధంగా ఉంటుంది.
........
3. అంతరాక్కరలో ... 1 సూర్యగణం, 2 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 4 గణాలు ఉంటాయి.యతి మూడవ గణము చివరి అక్షరం మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.
ఇనుడొ  కండును  నింద్రులి  ద్దరునొక
III UII UIU IIII
పై విధంగా ఉంటుంది.
ఇక్కడ ఒక తమాషా గమనించారా! దీనికీ తేటగీతి కీ పోలిక ఉంది.
యతి స్థానం గానీ ఒక్క అక్షరం ముందుకు జరిగిందా తేటగీతి ని పోలి ఉంటుంది.
........
4. అల్పాక్కరలో ... 2 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 3 గణాలు ఉంటాయి.
యతి రొండవ గణము మీద ఉంటుంది. ద్వితీయాక్షర ప్రాసతో ఉంది.
"ఒగి నిద్దరింద్రులు నొక విధుడు
నెగడు నల్పాక్కర నియతి తోడ."
పై విధంగా ఉంటుంది.
చివరి పాదం సీస పద్య ఉత్తరార్ధము వలె ఉంది కదా!
........
5. మధ్యాక్కరలో ... 2 ఇంద్ర గణాలూ,1 సూర్య గణమూ..2 ఇంద్ర గణములూ మళ్ళీ 1 సూర్య గణమూ .. కలిపి మొత్తం 6 గణాలు ఉంటాయి.
యతి మూడు గణము ల పై ఉంటుంది. ప్రాస ఉంది.
పై విధంగా ఉంటుంది.
మధ్యాక్కర ల విషంలో యతి విషయంలో కొంత స్పష్టత కనపడడం లేదు. నన్నపార్యుడు 4 గణములపైన అంటే పంచమగణాద్యక్షర యతి పాటించగా..ఎర్రన చతుర్ధ గణాద్యక్షర యతి పాటించడం విశెషం. ఎర్రన యతి గేయ ఛందో వైఖరి అంటారు .
ఈపురు షుండని స్త్రీయు నిద్దరే ఇంతియు బతియు
ఇం ఇం సూ ఇం ఇం సూ
విశ్వనాధ మధ్యాక్కరలలో గమనిస్తే ...
తిరుపతికింబోయి యొడలి నగలెల్ల దీసి ఇచ్చెదరు
అనే పాదం లో నన్నయ వలె ఐదవ గణము ప్రధమాక్షరం యతి గా పాటించడం గమనార్హం!
కాబట్టి యతి విషయంలో ఖచ్చితం గా వ్యవహరించలేకపోతున్నాము.
ఈ "అక్కర"ల విషయంలో ప్రొఫెసర్ కోవెల సంపత్కుమారాచార్య విశేష కృషి చేసారు. 
*పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...*
❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈
*శిలా శాసనాలు*
*అలాగే ప్రాచీన కాలం లో ఉన్న పద్యాలను (అంటే అవి ఆవిష్కరింప బడ్డ సంవత్సరాల ద్వారా) మనకు దొరికిన శిలా శాసనాల ద్వారా వాటిని చూద్దాము.*
• తరువోజ - పండరంగుని అద్దంకి శాసనం - క్రీ.శ 848
• ఆట వెలది - గునగ విజయాదిత్యుని ధర్మవరం - క్రీ.శ 850
• తేట గీతి - గుణగ విజయాదిత్యుని ధర్మ వరం శాసనం - క్రీ.శ  848
• మధ్యాకర - బెజవాడ యుద్ధ మల్లుని శాసనం - క్రీ.శ.  885
• కందం - జిన వల్లభుని కుర్కియాల శాసనం - క్రీ.శ.  941
• చంపకమాల - గుణగ విజయాదిత్యుని సాతలూరి శాసనం - క్రీ.శ  848
• ఉత్పలమాల - విరియాల కామసాని శాసనం - క్రీ.శ.1000 ప్రాంతం లో.
• మత్తేభం - సర్వదేవుని ఆది పురాణం - క్రీ.శ. 953.
• రగడ - రాజ రాజు కోరుమిల్లి శాసనం - క్రీ.శ 1022.
    *పై పట్టిక ద్వారా ముఖ్యమైన చందస్సులు ఆది నుంచీ ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. వచన రచన అనేది లేక పొయినా, చక్కని పద్య రచన కు ఆనాడే బీజం పడిందన్న విషయం బోధ పడుతోంది. వచన రచన కేవలం శాసనల్లో మాత్రమే చూడగలం.*
   *నన్నయార్యునికి ముందే కవులు వున్నారు. దానికి సాక్ష్యం ఉంది. ఐతే అవి సమగ్రం గా లేవు. సంపూర్ణ కావ్యాలేవీ దొరకలేదు. సర్వదేవుడనే కవి ఆది పురాణం రాసాడని అంటారు. ఆది పురాణం దొరికితే సర్వదేవుడు ఆది కవి లేకపోతే ఆది కవి అభ్యర్ధి గా మిగిలి పోతాడని ఆరుద్ర అన్నారు. ఏది ఏమైనా మనకు ఆనాడు పద్యాలను గ్రంధస్తం చేయక పోవడం వలన కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ, చారిత్రక విశేషాలు లభింపక పోవడం తెలుగు జాతికి తీరని లోటు. కాదంటారా!!!!*