Sunday, October 20, 2024

శీర్షిక : నాలో నేనెక్కడ...? గజల్

శీర్షిక : నాలో నేనెక్కడ...?


రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కల్యాణ్ .మహారాష్ట్ర 


చెప్పాలని ఎన్నున్నా చెప్పలేకపోతున్నా

అడగాలని ఎన్నున్నా అడగలేకపోతున్నా 

రాయాలని అనుకున్నది రాయలేకపోతున్న 

పాడాలని అనుకున్నది పాడలేకపోతున్నా !!


ఎరిగినట్టి సత్యాలను ఎదలోననే దాచి పెట్టి

మనసు చెప్పు మాటలనే మదిలోనే అణచిపెట్టి

కపటమైన నవ్వు వెనక వికటరూపు దాచిపెట్టి 

నిజాలకు నివురు పెట్టి ముఖానికో రంగు కొట్టి !!


కల్లలనే ఎల్లలుగా చేసుకుని బ్రతికేస్తూ 

ఎదుటి మనిషి పదవులకే దాసోహం అంటున్నా

కుక్క కన్న హీనంగా దాసోహం అంటున్నా 

సిగ్గులేని మనిషి బ్రతుకు బ్రతికి ఏమి లాభమన్న !!


వాదన ప్రతి వాదనతో బమ్మి,తిమ్మి చేస్తున్నా

అసలు నిజం తెలియకున్న అల్లరెంతో చేస్తున్నా

మార్పు రాని వ్యవస్థలో మార్చుతున్న చరితలెన్నో 

అక్షరాల కూర్పులలో అబద్ధాల రాతలెన్నో !!


ఫలము లేని వాదనలను పట్టు పడక చేస్తున్నా 

ప్రస్తుతమౌ పరిస్థితిని  పెడదారిని పెడుతున్నా

ముందడుగును వేయలేక సందుదారి నేలుతూ

ముసుగు తీసి ముఖము చూప ముడుచుకునే పోతున్నా !!

----------------------------------------



Saturday, October 19, 2024

06-10-2024 తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు వార పత్రిక వెబ్సైట్ లింక్..✍️*


+++++--------------------------------++++++++++
https://thapasvimanoharam.com/varapathrika-10-11-2024/
*10-11-2024 తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు వారపత్రిక వెబ్సైట్ లింక్..✍️*
-------------------------------------
https://thapasvimanoharam.com/varapathrika-06-10-2024/

**06-10-2024 తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు వార పత్రిక వెబ్సైట్ లింక్..✍️*

దసరా, బతుకమ్మ ' ప్రత్యేక e - కవితా సంకలనం 2024.. వెబ్సైట్ లింక్*

[12/10, 6:03 pm] +91 97007 34601: https://thapasvimanoharam.com/dasara-e-book-2024/
' *దసరా, బతుకమ్మ ' ప్రత్యేక e - కవితా సంకలనం 2024.. వెబ్సైట్ లింక్*
[12/10, 6:03 pm] +91 97007 34601: *అక్టోబర్ -2024- తపస్వి మనోహరం రచయితల 'దసరా,బతుకమ్మ' ప్రత్యేక అంతర్జాల కవితా సంకలనం విషయసూచిక...✍️* సంకలనంలో తమ రచనలతో భాగస్వాములైన వారందరికీ అభినందనలు 💐🙏

Wednesday, October 16, 2024

శీర్షిక: నీతి నియమాలు ఎక్కడ?రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి కల్యాణ్. మహారాష్ట్ర .(43)

అంశం: నీతి

ప్రక్రియ :  ఇష్టపది

కవితాసంఖ్య: 04

తేది: 17-10-2024, బుధవారం.

శీర్షిక: నీతి నియమాలు ఎక్కడ?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)



నేటి న్యాయ వ్యవస్థ నెంచ కుటిల మాయెను

మేటి ఘోర ఖలులతో నేడు చేయి కలిపెను !!

తోటి మనిషి బాధను తోసి తీర్పు నిచ్చెను

కాటి, జైలు వాసము కలుగజేసి చంపెను !!


ధర్మ న్యాయ నిరతిని దాటి ధైత్యు డాయెను

కర్మ భోగ మనుచును  కరకు గాను మారెను. 

నిర్మల మౌ బతుకుల నిలువు కోత  కోసెను  .

మర్మ మెరుగని వారి , మట్టి లోన కలిపెను !!


నేటి దేశ పాలన కోట్ల జనుల రోదన.

తోటి వారి హింసకు తోవ గనుటే యోచన

పాలకుల కుశాసన పలుక చిత్ర వేదన.

వేల యువత బాధలు వెరపు నిండు శోషణ.!!


తీర్చువాడే లేడు   తిరుగుబాటుల గోడు.

కూర్చు శిక్షలు వేలు , కుటిల బుద్ధులు చూడు.

నేర్పు చూపిన వాడు నేల బతుకడు వాడు

మార్చు ఓట్లను వారు మనిషికి రూక తోడు. 


లేపి దొమ్ములు నడుమ ,దొంగ ఓటుల గెలుపు

దోపిడీలే బ్రతుకు, దోచుకొనుటే బలుపు

 పాపి యగుచూ కులుకు  పాలకులదే గెలుపు.

 జూపి మత్తుల సరుకు జూద మాడిన కలుపు  !! 


రూకలాడిన యాట రూపు మారిన మాట

శోకమొందిన చోట ,లోక నాయకు వేట

చౌకబారుల తీరు చావు బతుకుల పోరు

చాకలాడే మిన్న చదువు లోడిన జోరు.


---------------------------------

ప్రక్రియ: వృషభగతి రగడ.

అంశం: ఐచ్ఛికం 
కవితాసంఖ్య: 03
తేది: 16-10-2024, బుధవారం.
శీర్షిక: జన్మ ధన్యము!!
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .(43)
ప్రక్రియ: వృషభగతి రగడ.



బాల కృష్ణుని /వలచి  భావపు/  భక్తి తోడను  /గొల్చి చూడుము
వేల నాముని/  మదిని దలచుచు/ వేడ్క వానిని / నమ్మి వేడుము !!
పాల వెన్నను / పంచ గ్వాలల/  పరుగు పరుగున/వచ్చు వేగము
బాల కృష్ణుడ /తండె  శ్రీహరి /భాగ్య మిదిమన  /జన్మ ధన్యము!!

1️⃣5️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు బహుకాల దర్శనం దసరా నవరాత్రులలో మీ అద్భుతమైన గానామృతాన్ని రుచి చూపించారు నేటి అంశానికి జన్మ ధన్యము శీర్షికతో మీరు రాసిన వృషభరతి రగడ చాలా బాగుంది సహజంగా గాయని అయిన మీరు మాత్రలను నడకను ఇట్టే పట్టుకున్నారు. రాబోయే బుధవారాలు కూడా తప్పక రాయండి ధన్యవాదములు మరియు అభినందనలు👏👏👏💐💐💐🙏🙏🙏

Friday, July 5, 2024

ఆషాఢమాసం

*రేపటి నుండి ఆషాఢమాసం ప్రారంభం , ఆషాఢమాసం విశిష్టత*

*ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి , ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ ,  వ్రతం ,  పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి "చాతుర్మాస్య వ్రతం" ప్రారంభిస్తారు.*

*దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.*

*ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే , లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.*

*తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.*

*అమ్మలుగన్న అమ్మ , ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు , మహిషాసుర మర్దిని , దుర్గా దేవిని , భైరవ , వరహా , నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.*

*కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే , 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.*

*ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా , కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే , చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.*

*శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు , శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

Monday, April 29, 2024

హన్సికలు ప్రక్రియ నియమాలు

*హంసిక* :- 

లక్షణాలు:- 

1) మూడు పాదాల ప్రక్రియ.

2) మూడు పాదాలలో కలిపి 30 నుండి 35 అక్షరాలుండాలి.

3)  ఒకటవ పాదము మరియు మూడవ పాదము ఆదిప్రాసలో ఉండాలి

4) రెండవ పాదము మరియు మూడవ పాదము అంత్యప్రాస లో ఉండాలి.

గమనిక :- *ఆది ప్రాసకు పాదం లోని  తొలి అక్షరాన్ని తీసుకోవాలి.*




ఉదాహరణ:- 

1)
చతికిల పడిపోకు ఓటమి ఎదురైందని
సరిచేసుకో లోపాలను
చక్కగా పొందేవు గెలుపును

2)
ఓపికతో ప్రయత్నించు విడవక 
ఆలోచిస్తూ నిత్యం కొత్తగా
ఓటమి అన్నది నీ దగ్గరకు రాదుగా

3)
కాంక్రీట్ కారడవిలో  స్వేద సన్యాసం
ఆద్యంతాలకై ఎదురుచూపుల కోలాటం
కాంక్షతో కాసుల పోరాటం

4)
వీడాలనుంది ఈ ఇరుకు భువిని
ఎందుకో ఏమో మనసులో
విహరించాలని ఉంది మరో లోకంలో


5)

గరీబు కోటలో గంజన్నమైనా
అమీరు ఇంట్లో పరమాన్నమైనా
గరళము కాదు సుధేగా ఏదైనా 

6)
చీకటి గుహలో అంకురము
వెలుగుల కడలిలో వృక్షము
చివరికి చితిలో ద్రవ్యము కాయము

7)

బాసలు వీడెను నిదురను
చెప్పులు ఏలెను రాజ్యము
బాణము చేసెను దుష్ట సంహారము

Saturday, April 27, 2024

వల్లభాపురం జనార్దన గారి కంద పద్యాలు.

పుస్తకమా జేజేలు
కంద పద్యాలు

స్వస్తనము సూపుగురువయి
తూస్తము నిజ జీవితాన తొలగించును భా
స్వస్తికమయిజనుల కలుపు
హస్తములను సాచునేర్పు నందించునురా

స్వస్తి నిడు జీవితానికి
నాస్తయి భద్రతనొసగును ఆర్ద్రత నింపున్
శస్తమగుసచ్చరిత్రపు
గోస్తని రసపానలోల గుణమును పెంచున్

గస్తుగ నిలబడి వినయపు
సిస్తుగ నినుమార్చునట్టి స్థిరవైద్యముతో
ధ్వస్తము సేయు నహంకృతి
కుస్తుభునిగ నిన్నునిల్పు కువలయమందున్

స్వస్తికులయినిర్భయముగ
దుస్తరమగు దోపిడిపయి దురమొనరించీ
శస్త నము నిర్ణయించెడు
గస్తులయి
జీవివితమ్మును గడపగ నేర్పున్

వల్లభాపురంజనార్దన
9440163687

Thursday, April 25, 2024

విహారయాత్ర

మహతీ సాహితీ కవి సంగమం.

ప్రతిరోజూ కవితా పండగే.

తేదీ : 25-4-24. బుధవారం.

అంశం : విహార యాత్ర.

కవితా సంఖ్య: 3 .


శీర్షిక : బాబోయ్ ఎండలు.

ప్రక్రియ : ఇష్టపది.


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

క్రమ సంఖ్య: 43.

------------------



వేసంగి సెలవులకు వేడి  ఎండల జోరు 

వేడుకల యాత్రలకు వెరసి పిల్లల పోరు.

చల్ల గాలులు నిండు చల్లని ప్రదేశమని 

కుల్లూమనాలీకి. కూడిపోయే మండి.!!


ఖర్చునిండిన యాత్ర కన్నీరు తెప్పించె

వంటి చెమటల బాధ వరుస కోపము పెంచె.

మంచులో ఆటలకు పెంచు రుసుమది జూచి

మారు మాటే లేక మరలిపోతిమి మేము !!


ఇంటి ఏ.సీలోన  ఇల్లే స్వర్గమాయె.

చలివేండ్రముల సేవ చక్కగా మదితోచె

పక్షులకు నీళ్లొ సగు పనికి పిల్లలు మురిసె

పసిడి ధాన్యములొసగి పరుగునల్లరి జేసె


చెట్ల నీడను గూడి చెలగి యాటలు యాడె

చేత చిలికిన చల్ల, చేరు వారికి పంచె

 మంచి పనులను నేర్పి మాత, తాతలు మురిసె

మేలు  యాత్రల కన్న మేటి పనులే మిన్న !!


----------------------------------


*శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు వేసవి సెలవులు ఎండల జోరు చల్లటి గాలులు పిల్లల పోరు కులుమనాలి విహారయాత్ర ఖర్చుతో కూడుకున్న ఇలలో స్వర్గమే అంటూ చెట్ల నీడలో చెలరేగి ఆడే ఆటలు చల్లటి మజ్జిగను తాతయ్యల మురిపాలు అన్నింటినీ కలగలిపిన సమ్మేళనం చక్కటి భావాలతో రచన బాగుంది, ధన్యవాదములు*

👌👏👌👏👌👌👏🚩👏🙏👍🙏💐






Wednesday, April 24, 2024

ద్విరదగతి రగడ .

మహతీ సాహితీ కవి సంగమం.

ప్రతిరోజూ కవితా పండగే.

తేదీ : 24-4-24. బుధవారం.

అంశం : ద్విరదగతి రగడలు.( ఐచ్ఛికం).


శీర్షిక : అల్లరి పాప.

ప్రక్రియ : దివరద గతి రగడ.

క్రమ సంఖ్య: 43.

కవితా సంఖ్య: 2.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

------------------



అందాల మా పాప యల్లరది చేసినది.

అందకను పరుగెడుతు నలసలసి పోయినది.

చందురుని నీటిలో చక్కంగ చూసినది.

అందుకొన  జాబిలిని యా నీట దూకినది.!!


ఊపు నిండిన పాప యురకల్లు వేసినది.

జాపుచూ చేతులను జాబిలిని పిలచినది.

ఆపు వారల జేరి  యాటలవి యాడినది.

కోపించు నాన్న గని కొట్లాట లాడినది.!!


హామీ:

ద్విరదగతి రగడ నా స్వీయ రచన.



1️⃣3️⃣✅పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు.. 

*అల్లరిపాప* శీర్షికతో మీరు వ్రాసిన *ద్విరదగతి రగడ* బాగుంది.. బాల్యంలోకి తీసుకువెళ్లారు.. 


సహజంగా మీరు సంగీత ప్రవీణులు కాబట్టి నడకను ఇట్టే పట్టుకున్నారు.. 

అంత్య ప్రాసలను గజల్స్ అనుభవంతో రదీఫ్ మాదిరిగా ఎంపిక చేసుకోవడం మీ ప్రతిభకు, సమయస్ఫూర్తికి తార్కాణం.. మిగిలిన వారికి ఇదో నమూనా కావచ్చు.. 


ధన్యవాదాలు మరియు అభినందనలు👏👏👏💐💐💐🙏🙏🙏




Tuesday, April 9, 2024

లింక్

క్రోధి.సంవత్సర  ఉగాది కవితల లింక్


https://thapasvimanoharam.com/april-masapathrika-2024/

*ఏప్రిల్ - 2024 తపస్వి మనోహరం అంతర్జాల త్రి భాషా మాస పత్రిక వెబ్సైట్ లింక్..✍️*
-----------------------------------

https://online.fliphtml5.com/xmioz/ffff/index.html
---------------------------------------------------------
https://thapasvimanoharam.com/varapathrika-07-04-2024/

*07-04-2024 తపస్వి మనోహరం అంతర్జాల వారపత్రిక వెబ్సైట్ లింక్..✍️*

Saturday, April 6, 2024

వేమన పద్యం దాని భావం.

మహతీ సాహితీ కవిసంగమం
ప్రతిరోజూ కవితా పండుగే

తేది:   06-04-2024.
 (  శనివారం)
అంశం:   పద్యం.      
 ( కవితాసంఖ్య-  6.)
శీర్షిక:      కోతి బుద్ధి. (వేమన పద్యం).
ప్రక్రియ:  ఆటవెలది పద్యం.

కవిసంఖ్య -43 .

కవి:  రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


వేమన పద్యం. 
-------------
కోతి నొకటి తెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్ఛు లెల్ల గొలిచి నట్టు
నీతి హీనులొద్ద నిర్భాగ్యు లుందురూ 
విశ్వదాభిరామ వినుర వేమ!!

భావం.
-------

వేమన గారు రాసిన ఈ పద్యం , ఎంత అనుభవంతో రాసారో గాని, నేటి పరిస్థితులకు , మనిషి ప్రవర్తనకు , చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది అనిపిస్తున్నది . 
కోతికి స్థిరమైన బుద్ధి అంటూ ఉండదు ,ఆలోచనా శక్తి అసలే ఉండదు. ఎవరి చేతిలో నైనా ఏదైనా వస్తువు ఉంటే ,
దానికి అవసరమా ,లేదా, అన్నది దానికి అక్కర్లేదు.
 అన్నిటినీ లాక్కోవడమే దాని పని . పోనీ లాక్కున్న తర్వాత తింటుందా ,వాడుకుంటుందా, అంటే అదీ తెలియదు .
లాక్కున్న వాటిని నలిపి, కొరికి. ముక్క ముక్కలు చేస్తుంది.
కావలసిన వారి దగ్గర ఉంచదు. అది కూడా అనుభవించదు.
అటువంటి కోతికి కొత్త బట్టలు కట్టి , కొండముచ్చులు అన్నీ కొలిచాయట. ఎందుకంటే , వాటికి కోతి చేసిన పనులు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప, దానివల్ల వచ్చే కష్టనష్టాలు వాటికి  తెలియవు. అందుకే అవి కూడా దాంతో పాటు పిచ్చిగా గెంతుతూ, దాని అల్లరికి వంతు పాడుతూ ,దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 

ఈ పద్యం భావం ఏమిటంటే నీతి, నియమం లేని వాడి దగ్గర 
నిర్భాగ్యులందరూ చుట్టూ చేరతారట. ఎందుకంటే వీళ్ళకి చేసేందుకు పనేమీ ఉండదు. 
నీతిలేని వాడికి పట్టం కట్టి, వాడి చుట్టూ తిరగడమే వీళ్ళ పని . వాడు చేస్తున్నది సభువుగా ఉందా ,  అసందర్భంగా ఉందా, అన్నది వీళ్లు ఆలోచించరు . ఎందుకంటే ఇవేవీ వీళ్ళకి అక్కర్లేదు. దొమ్ములాటలు చేయడం , ఒకరి వస్తువులను బలవంతంగా లాక్కోవడం , వాళ్లు బాధపడి ఏడుస్తూ ఉంటే, చూసి ఆనందించడం తప్ప ,వీళ్ళకి మరొక కాలక్షేపం ఉండదు.
ఈ భావాన్ని వేమన గారు ఒక చిన్న పద్యంలో ఎంతో చక్కగా  చెప్పారు.
వేమన గారు రాసిన ప్రతి  పద్యం లో ఏదో ఒక నీతి , సూక్తి దాగి ఉన్నాయి.
ఇటువంటి పద్యాలను చదవడం వల్ల మనకి , 
నేర్పించడం వల్ల పిల్లలకి, చాలా లోకజ్ఞానం కలుగుతుందన్నది మాత్రం నిజం.

ఈ పద్య భావం నా స్వీయ రచన.