మహతీ సాహితీ కవిసంగమం
ప్రతిరోజూ కవితా పండుగే
తేది: 06-04-2024.
( శనివారం)
అంశం: పద్యం.
( కవితాసంఖ్య- 6.)
శీర్షిక: కోతి బుద్ధి. (వేమన పద్యం).
ప్రక్రియ: ఆటవెలది పద్యం.
కవిసంఖ్య -43 .
కవి: రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
వేమన పద్యం.
-------------
కోతి నొకటి తెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్ఛు లెల్ల గొలిచి నట్టు
నీతి హీనులొద్ద నిర్భాగ్యు లుందురూ
విశ్వదాభిరామ వినుర వేమ!!
భావం.
-------
వేమన గారు రాసిన ఈ పద్యం , ఎంత అనుభవంతో రాసారో గాని, నేటి పరిస్థితులకు , మనిషి ప్రవర్తనకు , చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది అనిపిస్తున్నది .
కోతికి స్థిరమైన బుద్ధి అంటూ ఉండదు ,ఆలోచనా శక్తి అసలే ఉండదు. ఎవరి చేతిలో నైనా ఏదైనా వస్తువు ఉంటే ,
దానికి అవసరమా ,లేదా, అన్నది దానికి అక్కర్లేదు.
అన్నిటినీ లాక్కోవడమే దాని పని . పోనీ లాక్కున్న తర్వాత తింటుందా ,వాడుకుంటుందా, అంటే అదీ తెలియదు .
లాక్కున్న వాటిని నలిపి, కొరికి. ముక్క ముక్కలు చేస్తుంది.
కావలసిన వారి దగ్గర ఉంచదు. అది కూడా అనుభవించదు.
అటువంటి కోతికి కొత్త బట్టలు కట్టి , కొండముచ్చులు అన్నీ కొలిచాయట. ఎందుకంటే , వాటికి కోతి చేసిన పనులు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప, దానివల్ల వచ్చే కష్టనష్టాలు వాటికి తెలియవు. అందుకే అవి కూడా దాంతో పాటు పిచ్చిగా గెంతుతూ, దాని అల్లరికి వంతు పాడుతూ ,దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
ఈ పద్యం భావం ఏమిటంటే నీతి, నియమం లేని వాడి దగ్గర
నిర్భాగ్యులందరూ చుట్టూ చేరతారట. ఎందుకంటే వీళ్ళకి చేసేందుకు పనేమీ ఉండదు.
నీతిలేని వాడికి పట్టం కట్టి, వాడి చుట్టూ తిరగడమే వీళ్ళ పని . వాడు చేస్తున్నది సభువుగా ఉందా , అసందర్భంగా ఉందా, అన్నది వీళ్లు ఆలోచించరు . ఎందుకంటే ఇవేవీ వీళ్ళకి అక్కర్లేదు. దొమ్ములాటలు చేయడం , ఒకరి వస్తువులను బలవంతంగా లాక్కోవడం , వాళ్లు బాధపడి ఏడుస్తూ ఉంటే, చూసి ఆనందించడం తప్ప ,వీళ్ళకి మరొక కాలక్షేపం ఉండదు.
ఈ భావాన్ని వేమన గారు ఒక చిన్న పద్యంలో ఎంతో చక్కగా చెప్పారు.
వేమన గారు రాసిన ప్రతి పద్యం లో ఏదో ఒక నీతి , సూక్తి దాగి ఉన్నాయి.
ఇటువంటి పద్యాలను చదవడం వల్ల మనకి ,
నేర్పించడం వల్ల పిల్లలకి, చాలా లోకజ్ఞానం కలుగుతుందన్నది మాత్రం నిజం.
ఈ పద్య భావం నా స్వీయ రచన.
No comments:
Post a Comment