17/06/2023.
తపస్వి మనోహరం పత్రిక కొరకు
అంశం : నాన్న.
విభాగం : కవిత.
శీర్షిక. : నా ఉనికి చిరునామా!
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
నవమాసాలూ మోసేది అమ్మే అయినా
నన్ను ఎప్పుడు చూస్తానా అన్న
ఆత్రుతతో నిరీక్షిస్తున్న నాన్న !
అప్పుడే పుట్టిన నా బుగ్గలను-
ఆప్యాయంగా తడుముతూ-
ఆనందాశృవులతో,గంభీరంగా నాన్న!
నాకు తెలియని ప్రపంచాన్ని
నాకై పరిచయం చేస్తూ, నాన్న !
నా ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకుని-
పగలు రాత్రుల కష్టానికి-
కావిడి బరువు మోస్తున్న నాన్న!
ఒడిదుడుకుల జీవిత సాగరంలో,
ఓలలాడుతున్న సంసార నావను-
ఒద్దికగా తీరం చేర్చే ,చుక్కాని నాన్న !
నా దివ్యమైన భవిత కోసం ,
బాధ్యతల "బరువు " మోస్తున్న నాన్న !
గెలుపులో నా మొదటి ఆనందం నాన్న .
ఓటమిలో నా కన్నీటి ఓదార్పు నాన్న !
నా తప్పటడుగుల తలపు జోరుకు,
మార్గదర్శక దండన నాన్న !
అవివేకం నిండిన అజ్ఞానానికి,
విజ్ఞాన గీతను బోధించే
విష్ణు స్వరూపం నాన్న !
నా అంతరంగ ఆలోచనలకు
ఆదర్శం నిండిన ఆచరణ నాన్న.!
నా ఉన్నత జీవిత సాఫల్యానికి
అక్షర శ్రీకార సారం నాన్న !
నా ఉనికి గుర్తింపు జయానికి
చెరగని చిరునామా నాన్న !!
ఈ కవిత నా స్వీయ రచన.
No comments:
Post a Comment