*క్షంతవ్యం* .... అసందర్భం అయినప్పటికీ సమూహ సభ్యులతో పంచుకోవాల్సిన విషయం అనిపించి ఇది పోస్ట్ చేస్తున్నాను🙏🙏🙏
ప, ఫ, బ, భ, మ లను ఏమంటారు… అవి లేకుండా రామాయణం రాశారని మా నాన్న గారు నా చిన్నప్పుడు చెప్పినట్టు గుర్తు… ఎంత మంది ని అడిగినా సరి అయిన జవాబు లేదు.. (రామ పదానికి బదులు దశరధ నందనుడు లాంటివి వాడారని విన్నాను) నిజమేనా ?
*మరింగంటి సింగరాచార్యులు* అనే గొప్ప కవి “నిరోష్ఠ్య రామాయణం” రచించాడు. ఆయన చాలా సుప్రసిద్ధుడు.. తెలంగాణలోని నల్లగొండ జిల్లా, దేవరకొండ ప్రాంతానికి చెందిన 16వశతాబ్దపు కవి. ఆయన వైష్ణవ బ్రాహ్మణుడు. ఇతని తండ్రి వేంగళాచార్యులు. తాత తిరుమలాచార్యులు.
కవిత్వం ఒక శిల్పం.. మేధావులు తమ నైపుణ్యం చూపుతూ ఇలాంటి రచనలు చేస్తారు. 19 వ శతాబ్దం చివరి వరకూ కూడా ఈ రచనలకు ఆదరణ ఉండేది. ఇవి డిగ్రీలో పాఠ్యాంశాలు గా కూడా ఉండేవి. వీరేశలింగం గారి *శుద్ధాంధ్ర నిర్వచన నిరోష్ఠ్య నైషధము* ఇందుకు ఒక చక్కని ఒక ఉదాహరణ. “ఓష్ఠము” అంటే పెదవి... ప,ఫ,బ,భ,మ లు ఓష్ఠ్యాలు. ఇవీ మరియు వీటి గుణింతాలూ ఎక్కడా రాకుండా కావ్యం అంతా వ్రాయడం…. ..పైగా “రామాయణం” లో ఎంతో విశేషం. ఇలాంటివే 16 గొప్ప గ్రంథాలు చిత్ర బంధ కవిత్వాలతో కూడినవి రచించి పండితాదరణ పొందాడు సింగన్న.
1520–90 ప్రాంతాలలో జీవించిన ఈ కవి ఇబ్రహీం కుతుబ్ షాహీ చేత ఘన సన్మానాలు పొందాడు. *నల యాదవ రాఘవ పాండవీయము* అనే చతురర్థి (ప్రతి పద్యంలోనూ నాలుగు అర్థాలు వస్తూ, నాలుగు కథలు సమాంతరంగా ఒకే కావ్యంలో నడవడం) ఆయన ప్రజ్ఞకు కొలమానంగా నిలుస్తుంది.
No comments:
Post a Comment