Tuesday, March 25, 2025

శీర్షిక : కర్తవ్యం.




మహతి సాహితీ కవి సంగమం.

ప్రతీరోజు కవితా పండగే.

24/03/2025.

అంశం :  చిత్ర కవిత.

శీర్షిక : కర్తవ్యం.

కవిత సంఖ్య 1.

రచన :శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 

కళ్యాణ్ :  మహరాష్ట్ర...(43).




అమ్మ మాటల్లో నాన్న కబుర్లు.

దేశ సిపాయిగా పోరాడే గాధలు. 

వింటున్న కొద్ది వినాలనిపించే కథలు.

పాప తలపుల్లో నాన్న పై పెరిగే వలపులు !!


పాప చిరు జ్ఞాపకాలలో వెన్నెల దీపం. 

రెండేళ్లై ఇంటికి రాని నాన్న అందమైన రూపం.

తను చెప్తున్న మాటలు వింటున్న సంతోషం

నాన్న కురిపిస్తున్న మురిపాల ముద్దులు వర్షం.!!


పాప దృష్టిలో  నాన్న ఒక పెద్ద "హీరో".

ఎంతో  మంది నాన్న ముందు "జీరో."

 నాన్న దేశానికే "బ్యాక్ బోన్ "

చిట్టి తల్లి  ఊహల్లో నాన్నో  "సూపర్ మాన్ "!!


కలత నిద్దురలో కనిపించే బొమ్మలు.

పాప ఆడే ఆటల్లో మురిపించే మువ్వలు.

చేతుల నిండా తీపి మిఠాయి, చాక్లెట్లు.

నోరూరించే ఇష్టమైన చిరుతిళ్ల ప్యాకెట్లు !!


నాన్న రాక కోసం చిన్నారి ఎదురుచూపులు.

 తెల్లారితే తీరనున్న ముద్దు మురిపాలు. 

తొలికోడి కూతతో, వెలుగు నింపిన కిరణాలు

ఆలస్యం భరించలేని అమృత క్షణాలు.!!


తీసి ఉంచిన తలుపుల దగ్గర నాన్న రూపం. 

మడచిన నాన్న చేతుల్లో తన కలల సామ్రాజ్యం.

బహుమతుల  సంచులకు  పలికే స్వాగతం.

నాన్న ఒడి చేరిన ఆత్రుతకు నిదర్శనం.!!


క్షణం తర్వాత తెలిసిన నిజం. 

తనను దగ్గరకు తీసుకోలేని 

నాన్న నిస్సహాయత్వం. 

బాధ్యత గల సిపాయిగా .

దేశం కోసం నాన్న చేస్తున్న 

త్యాగానికి  దక్కిన ఫలం .!!


"దేశభక్తి" అంటే ఏమిటో తెలిసిన 

పాప కళ్ళలో భావోద్వేగం.

రక్తసిక్టమై తెగిన నాన్న చేతులకు

తన చేతులు ఇస్తున్న ధైర్యం .!!


"సిపాయి కూతురుగా నా కర్తవ్యం

వారసురాలిగా  నేనున్నానన్న "

నా నిర్ణయానికి నాన్న కళ్ళల్లో 

కోటి వెలుగుల ఆనందోత్సవం !!



No comments:

Post a Comment