Saturday, August 15, 2020

గజల్

ముషాయిరా గజల్ 🌹

ఆమెమనసుకే విలువను ఇవ్వగలిగి ఉండాలి 
ప్రేమపావురం రెక్కలు సాచగలిగి ఉండాలి 

దిగులుసెగలలో తానే కలతచెంది ఉండగా 
మలయమారుతం నీవై వీచగలిగి ఉండాలి 

సంఘటనలతో ఖేదం మనసువిరిగి పోనీక
సర్దుబాటుతన మెంతో చేయగలిగి ఉండాలి 

మౌనసాక్షిగా రేయికి చందమామ ఉన్నాడు 
సరసభావనల వెన్నెల పంచగలిగి ఉండాలి 

మోహబంధమే ఇలలో దంపతులకు భావ్యమై 
అంతరాలలో హద్దులు 
చెరపగలిగి ఉండాలి 

పోల్చిచూడటం జీవిత మాధుర్యం హరణమే 
పొల్లుమాటలను నీవిక
ఆపగలిగి ఉండాలి 

ఇంద్రచాపము ఉమకే రంగులకల పంచుతూ 
కడలికెరటమై చెలియను 
చేరగలిగి ఉండాలి 

ఎం. వి. ఉమాదేవి 
    నెల్లూరు

No comments:

Post a Comment