Thursday, August 6, 2020

రామునిపై ఆటవెలది లో పద్యాలు.

డా. బల్లూరి ఉమాదేవి

షోడశ కళలతో విరా జిల్లు శ్రీరామచంద్రునకు షోడశ పద్యాలతో అక్షరార్చన

1ఆ.వె:భూమి భార మణచ భువిని          అవతరించె 
       దశరథునకు తాను తనయుడగుచు
     ముగ్గురమ్మలకును ముద్దుల బిడ్డడై
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

2ఆ.వె:శిష్ట జనుల గావ శ్రీరామచంద్రుడై
       చైత్ర శుద్ధ మందు జననమొందె
     ముదము పొందు చుండు పురజనులెల్లరు
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

3ఆ.వె:గాది సుతుని తోడ కానల కేగితా
       నస్త్ర విద్య లరసి యసురవరుల
     బాల్యమందె కూల్చి ప్రఖ్యాతి నొందిన
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

4ఆ.వె:రామ నామ మహిమ రాయిగా మారిన
       యింతియా యహల్య  యెరుక పరచె
    శరణు కోరినంత వరములొసగుచుండు
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

5ఆ.వె:శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడ
     మెచ్చి రెల్లసురలు మేటి గాను 
     పూల వాన కురియ పుడమి పులకరించె
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

6ఆ.వె:పరశురాముడడ్డు పడగ మార్గము నందు
      వినయశీలి యగుచు విష్ణుధనువు 
       వంచ మెచ్చి మునియు వాసిగా వనికేగె
       రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

7ఆ.వె:తండ్రి మాట మేర దాశరథియుతాను 
       కాన కేగి నాడు కాంతి తోడ
      భ్రాత వెంటరాగా పరమోత్సుకత తోడ
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

8ఆ.వె: వలచి వచ్చె నంట వనిత రూపము తోడ
     చుప్పనాతి యైన శూర్పనఖ యు
     ముక్కు చెవులు కోసి మునియుచుసౌమిత్రి
     రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

9ఆ.వె:పసిడి జింకనుగని వసుధిజ వాంఛించ
        కోర్కె తీర్చ నేగె  కూర్మి తోడ
      రావణుండు వచ్చి రమణిని గొంపోయె
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

10 ఆ.వె:అభయ మొసగి నాడు నర్క సుతునకట
     వాలిని వధియించి వాసిగాను 
     ప్రభువు గాను చేసె వానరులకునెల్ల
     రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

11ఆ.వె:ఆంజని సుతు కొసగె నంగుళీయకమును
     నంద చేసె హనుమ నతివ కపుడె
     రామబంటు గానె రాణ కెక్కె నుతాను
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

12ఆ.వె:సీత వార్త నరసి చిత్రములు మురిసి
      శరధి బంధనమ్ము చక్క గాను 
   చేసి కపుల తోడ సింధువు దాటిన
    రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

13ఆ.వె:అసురవరు డటంచు నావల నెట్టక
    శిష్టుడనుచు నెంచి  శీఘ్రగతిన
     నాదరణము చూపె నావిభీషణు పైన
    రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

14ఆ.వె:దశశిరు దునుమాడి ధరణిజతో పాటు
      పుష్పకమ్ము నందు పురిని చేరి 
    సంతసమ్ము గూర్చెజనులమనములందు
      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర

15ఉ.మా

నమ్మితి మానసమ్మునను నన్నిక బ్రోచెడి భారమీ దెగా
కమ్మగనాదునాల్కపయిగంతులువేయగ నీదు  నామమే
నెమ్మి ని చూపుచున్ సతము నీదయ నీగతినెల్ల  వేళలన్
జిమ్ముచు నుండ వేడితిని సేవలు గైకొని కావ రమ్మికన్.

16. అంగనలెల్లచేరుచును హారతులెత్తుచు  మంగళమ్మనన్
చెంగట సీతతో సతము శ్రీలనొసంగగ రమ్ము రాఘవా
నంగము వంచి మ్రొక్కెదను నార్త పరాయణ ఆలసింపకన్
 సంగ సుఖమ్ములిచ్చుచును సత్వరమాశిసు లంద  చేయుమా

No comments:

Post a Comment