22 సంవత్సరాల క్రితం శ్రీ సీతారాముల గురించి మిడి మిడి జ్ఞానంతో చిన్న వర్ణనతో ఏదో ఒక చిన్న పుస్తకం రాయాలనుకున్నాను దానికొఱకు ప్రాచీన కవుల వలె శ్రీరామునికి అంకితం ఇవ్వడం కోసం *షష్ఠ్యంతములు* వ్రాసి పెట్టుకున్నాను. కాలక్రమేణ ఐహిక సంబంధమైన అనేక కారణాల వలన అది ఏమాత్రం ముందుకు సాగలేదు ఇప్పుడా కవితాధారలేదూ.... ఆ ఓపిక లేదు ప్రస్తుతం అయోధ్యలో శ్రీసీతారామాలయ నిర్మాణ భూమిపూజ సందర్భంగా ఆ పద్యములు గుర్తుచేసుకుంటున్నాను.
*షష్ఠ్యంతములు*
*శేషం సుప్రసన్నాచార్యులు*
*కందము*
ప్రణతులుపురుషోత్తమునకు
ప్రణతులురాక్షసవినాశపారీణునకున్
ప్రణతులు సీతావిభునకు
ప్రణతులుశ్రీరామచంద్ర పదయుగమునకున్!
*కందము*
శ్రీరామచంద్ర విభునకు
ధీరోద్ధతసుగుణజాలతేజోమణికిన్!
సారసనేత్రునకును సు
శ్రీరాజితపదములలరుశ్రేయోనిధికిన్!
*కందము*
ఇల్లిందనివాసునకును
బల్లిదరాక్షసవినాశప్రజ్ఞామణికిన్!
విల్లునువిరిచినసీతా
వల్లభుడౌ రామచంద్రపాదయుగళికిన్!
*కందము*
రామునికిన్! రమ్యసుగుణ
ధామునికిన్! స్నిగ్ధహాస ధర్మాంబుధికిన్!
భీమునికిన్! సమరోద్ధత
ధీ మహిమాన్వితవిశేష ధిషణోన్నతికిన్!
*కందము*
సలలిత తేజోమూర్తికి
విలసిత ప్రజ్ఞాధురీణవీరవరునికిన్!
వెలుగులనొసగెడువానికి
చెలిమినొసగి చెలగునట్టి శ్రీరామునికిన్!
*కందము*
శ్రీరఘువంశోద్ధరణుని
పారీణతకున్! వినీలభాసోన్నతికిన్!
శ్రీరమ్యునిగుణములకును
వారిజనేత్రునికిదివ్య పాథోనిధికిన్!
🪔🪔🪔🪔🪔🪔
No comments:
Post a Comment