Thursday, August 6, 2020

ఆటవెలదులు

[8/6, 12:38] +91 91219 11742: ఆటవెలది

పథములెన్ని యున్న   పరమాత్ముడొక్కడే
మతములెన్నియున్న మంచి కొరకె
మానవతను మించి మరిదైవమున్నదా
మర్మమెరిగిమసలు మనసునందు

తేటగీతి

తల్లిపాలనుత్రాగుచూ దల్లిజంపు
విషపుమొక్కనుబీకుట విధియుగాదె
మాతృమమకారముండిన మనుజులందు
కడుగ నిటుమంటి దుశ్ఛర్య గదలవలెను

ఆ.వె

మాటకరకుగున్న మర్యాదదగ్గును
మాటమృదువుగున్న మన్ననందు
మాటతీరులోనె మనుజులమర్యాద
సత్యమిదియెగనుము సర్వజనుల

ఆ.వె

ఐహికసుఖమందు ఆశచేమనుజులు
శీలమిడ్చుటెల్ల సిగ్గుగాదె?
సిరిసుఖముల కన్న శీలమ్ముముఖ్యము
చిత్తమందునిలుపు శీలగుణము

ఆ.వె

సిగ్గుఎగ్గుమరచి శీలమిడ్చుజనులు
ఐహికంబులందు నాశజేత
సిరిసుఖముల కన్న శీలంబు ముఖ్యంబు
శీలమిడవకయ్య సిగ్గుయెరిగి

ఆ.వె

ఊపిరాగువరకు నుండుజనులకాశ
కట్టెకాలుపిదప కడకు ముగుయు
ఆశకంతువుండ దనవరతమ్ముగ
పరిమితముగనున్న పరగ మేలు

     ఆటవెలది

అయినవారిచెలిమి అల్లమ్ముబెల్లమ్ము
కర్రువాతవోలె కానిచెలిమి
అనుభవమునదెలియు నదియునవనియందు
తెలిసిమసలుకొమ్ముతెలివితోడ

ఆటవెలది

సన్నకంతయనియు జాప్యమ్ము జేసిన
పుట్టినీరుజేరి మునుగు నీట
అన్నివేళలందు ఆలసించదగదు
జాగువీడిమెలుగు జగతియందు

ఆ.వె

కాల గతిన కరుగు కష్టమదేదైన
మనసు కుదుట పడును మౌనముగను
విధియు జేయు వింత విశ్వేశురుడెరుగు
విదులనిలుపు ధ్యాస విధినిమరచి

ఆటవెలది

సాటి మనిషి తోడ సవ్యముగ మెలగు
వివక్ష బుద్ధినందు వీడి జనుల
సఖ్యతున్నధరనసాధ్యమదేదైన
మైత్రితోడమెలిగి మంచిపంచు

తేటగీతి

ఆడిదప్పినపుడు ఆత్మయౌనుక్షయము
నిత్యమైనిజవర్తనం నిలచివెలుగు
సత్యవర్తనం జనులకునిత్యరక్షగు
మరువకయ్యసత్యమెపుడు మదియునందు

ఆ.వె

నాది నాది యనుచు నరుడుతపనచెందు
కాటియందు కట్టెగాలువరకు
యేదివెంటరాదు యెరుగ యశముదప్ప
వినుడిసత్యమిదియె విశ్వజనుల

ఆటవెలది

ప్రతిభకాలరాసి పాతరేసినపుడు
ప్రగతిపరుగులాగి పట్టుదప్పు
ప్రతిభఅందలాన ప్రగతిపట్టాలెక్కు
విశ్వసత్యమిదియు వినుడిజనుల

ఆటవెలది

మతము లెన్ని యున్న మమతపంచుటయేగ
కులము లన్ని పొట్ట కూటికొరకె
కులమతములపేర కుమ్ములాటవలదు
మదిన ప్రేమ తోడ మసలు జనుల

ఆటవెలది

ప్రతిభ యున్నవారు పరులకు సూచన
జేసి తప్పు నుసరి జేతురెపుడు
చేవలేనివారు చెణుకులి సురుతుండు
పరులదెబ్బతీసి పరిహసిస్తు

మనిషి ప్రస్థానం (తేటగీతి)

పుట్టి పెరుగును పొత్తిళ్ళ ముద్దుజేసి
కరుగును వలపు కౌగిళ్ళ కనులుగలసి
జారు సంసార బంధాల సాగరమున
ఒదుగు వృద్ధాప్యఛాయన ఓటమెరిగి

ఆటవెలది

మాట జారెనేని మనసుగాయమగును
మమతలన్ని విరిగి మాయ మగును
తిరిగిరాదు మాట త్రిమ్మూర్తులొకటైన
మాట లాడు మయ్య మదిని దలచి

ఆటవెలది

కంచె చేనుమేయు కదలకుండినపుడు
బతుకు భారమగును బద్ధకమున
నిత్య జీవి తాన నిస్త్రాణమీడిన
బతుకు ఆశ పండి భవ్యమగును

ఆటవెలది

ఆశమీరినపుడు అల్లరగు మనిషి
పరిమితంగనున్న పరగమేలు
ఆశలేని వాడె అధిక సంపన్నుడు
ఆశవీడు ఐహికంబులందు

ఆటవెలది

పద్య రచన యందు పరమోత్తముడనుచు
విర్రవీగువాడు వెర్రివాడు
తాడిదన్నువాని దలదన్ను వాడుండు
అహము వీడి మెలుగు అవని యందు

ఆటవెలది

నీతి దప్పనోడు నిప్పుగన్నను మిన్న
వాని కీర్తి బ్రాకు వసుధ యందు
ఇలన నీతిగున్న ఈశుడు మెచ్చును
నిజము సుమ్మి నిదియు నిక్కముగను

ఆటవెలది

మంత్ర తంత్రమంటు మాయమ్ము జేతురు
నీచగుణులు ధరన నీతి మరచి
విద్యతోటి జనులు విజ్ఞాను లగువేళ
విరగడగును వీరి వింతపీడ

             ఆటవెలది

కండకావరంబు కల్గించు గులగజ్జి
మాన్పలేము దీన్ని మందు తోటి
మానవతను మించి మరియేమి కులముంది
తరచి జూడ నేటి తరమునందు

ఆటవెలది

ధనము నందు కాంక్ష దండిగనున్నోడు
సౌఖ్యమెన్నడెరగ సృష్ఠినందు
ఖ్యాతి వెంట వచ్చు కాసులు గాదయ
విడువు మయ్య కాంక్ష విత్త మందు

ఆటవెలది

కామవాంఛ తోడ కనుల పొరలుగ్రమ్మి
కాంత జెరచి చంపు ఖలులు బుట్టె
కలియుగంబునిట్లు కడయందు జరిగేను
కాంచుమయ్య జనుల కనులదోటి

ఆటవెలది
తగ్గియుండినేని తగువైన వేళందు
కరుగు కోపగుణము క్రమముగాను
సహనగుణమె ప్రజకు సాయుధ రక్షగును
తెలిసి నడుచుకొమ్ము తెలుగు వీర

     ఆటవెలది

సంపదెంతయున్న సంతృప్తి లేకున్న
యేడ్పుకదియు నిలన హేతువగును
అదుపులేని కాంక్ష నాపద గొనితెచ్చు
ఆంక్షబెట్టినడచు కాంక్షయందు

 ఆటవెలది

బలములేనిచోట పలకొద్దు బీరాలు
ఒదిగివుండుటెల్ల ఓటమవదు
కొండ కంప్యుటరున కొంచెమై యుండదా?
పరిమితెరిగివీవు పలుకుమయ్య

ఆటవెలది

మంచి జేయమేలు మనతోడు వురుకును
కీడుజేయమనల చెడుతరుమును
కర్మఫలముదప్ప గరళకంఠుకుకాదు
కర్మయందుశ్రద్ధ గల్గి నడుచు

                   ఆ.వె

చిక్కులుండినెడల చింతించ వలదోయి
నుర్విజనులకెల్ల నుండుచిక్కు
సాధనమున చిక్కుసమసిపోవుసులువై
అరయిక నిజమిదియె నవనియందు

ఆ.వె

అల్పజనుల మైత్రి యాపద గొనితెచ్చు
సుజనమైత్రి  సేయు సుమ్మి మేలు
త్యాగబుద్ధి మైత్రికాలంబనగును
మైత్రితోడమెలిగి మంచిగనుమ

ఆ.వె

కుంగబోకుమెల్ల కువిమర్శలెదురైన
పొంగబోకుమెల్ల పొగిడినపుడు
పొంగకుంగనోడె పోరందునిల్చుర
విశ్వసత్యమిదియె వినుడిజనుల

      చందుతంగెళ్ళఆవె

కఠిన సత్యమెల్ల కష్టాన కానగు
మాయ పొరలు తొలగి మనసు నందు
కారు చీకటందు కానగు తారోలె
విశ్వ సత్యమిదియె వినుడి జనుల

చందు తంగెళ్ళ
[8/6, 12:45] +91 91219 11742: ఆ.వె

నోచదెన్నడైన నోబెళ్ళకిండియ
చదువులందుసృజన జాడలేక
చదువులందు సృజన సర్వోన్నతమ్మౌను
మరువకయ్య సృజన భవితదలచి

        ఆ.వె

భాషభూషితమున భావమ్ముసొబగద్దు
భాషలేనినాడు బ్రతుకులేదు
భాషవెలుగుచుండు భావదర్పణముగ
ప్రతినసేయుమోయి భాష కొరకు

తేటగీతి

విద్య వ్యాపారమౌవేళవిశ్వమంత  
విలువలన్నియు లుప్తంబు వినుడి జనుల 
నేతిబీరచందమ్ముగ నేటిచదువు 
సారహీనమైచేటయ్యె జాతికిపుడు

ఆటవెలది

భారతాన చదువు బట్టీయ మవువేళ
సృజనశీలమునకు స్థానమేది
కార్పొరేట్లు జేయు కాసులవేటలొ
నదికొడిగడుతున్న వత్తియయ్యె

ఆ.వె

గురువుగానిగురువు గూగులుండెడివేళ
విద్య నేర్చు చుండ్రి విశ్వజనులు
గురువులందు విశ్వగురువు గూగులెనయా
పేదవాళ్ళచదువుపెన్నిదవుతు

క్రిస్మస్

తేటగీతి

శాంతి సందేశముల భవ్య క్రాంతి తోడ
అంబరాన్నంటి జరిగెడి సంబరాన
విరయ గమమత క్షమతలు ధరణి మురిసి
క్రీస్తు గాకరుణుదయించి క్రిస్మసయ్యె

ప్రేమ

తేటగీతి

కనులు కలవంగ నుదయించు  మదిన ప్రేమ
పేద ధనికంబు జూడదు ప్రజల  ప్రేమ
కులమతంబుల భేదంబు కనదు ప్రేమ
జాతి జీవింధనంబగు అమర ప్రేమ
ఆటవెలది

పల్లెలందు బల్బు పగలుగూడ వెలుగు
విధులు మరచు జనులు వీధినున్న
ఇంధనాల పొదుపు  ఇచ్చు జాతిభవిత
వ్యర్థపర్చకోయి వనరులెల్ల

ఆటవెలది

అక్కు జెక్కు లెండి ఆకలి కల్లాడు
పేద లడుగు తుంది పొట్ట కూడె
వృద్ధి సూచి తోటి విఫలప్ర యోగంబె
మంత్ర శక్తి చింత రాల్చ నట్లు

ఆటవెలది

బిరడనాపకున్న బిందు నీరేయని
గంట గడుచు సరికి గ్యాలనగును
నీటి వనరె జాతి నిజసంపదంబగు
వ్యర్థపరచకోయి వనరులెల్ల

ఆటవెలది పద్యము

ఆంధ్ర దేశమందు ఆనంద వేదిక
కార్య భావ జ్ఞాన కథల తోటి
బాలలందు పెంచు బహుముఖ ప్రజ్ఞను
విలువలున్న విశ్వ విద్య నేర్పి

తేటగీతి

ప్లాస్టికుపయోగముజేయు  ప్రకృతి క్షయము
మనిషి మనుగడ కదిపొగ మంటబెట్టు
ప్లాస్టిక్రహిత పచ్చని ప్రకృతి కొరకు
పౌరు లెల్లరు కదలాలి ప్రతినజేసి

ఆటవెలది

మాతృ భాష నొదిలి పరదేశ భాషను
దెచ్చు తెలుగు భాష ద్రోహు లార
మాతృ భాష లోనె  మానవ మనుగడ
తెలిసి నడుచు కొమ్ము తెలుగు వీర

No comments:

Post a Comment